1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జులై 2021 (16:11 IST)

COVID scare: తమిళనాడులో జులై 19 వరకు లాక్‌డౌన్ కొనసాగింపు

Tamil Nadu
కరోనా థర్డ్ వేవ్ కారణంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది. కొన్ని సడలింపులతో జులై 19 వరకు అమలు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, దుకాణాలను మాత్రం రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంచేందుకు అవకాశం కల్పించింది.
 
తమిళ రాష్ట్రంలో రెస్టారెంట్లు, టీ దుకాణాలు, బేకరీలు, రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, మిఠాయి దుకాణాలకు మరో గంటపాటు సడలింపు ఇచ్చారు. 50శాతం కస్టమర్లతో రాత్రి 9 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచుకొనేందుకు అవకాశం కల్పించారు. 
 
అయితే, కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలుచేయడంతో పాటు ఆయా దుకాణాల బయట శానిటైజర్లు ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏసీ వినియోగించే సంస్థలు/ కార్యాలయాల్లో మాత్రం తగిన వెంటిలేషన్‌ ఉండేలా జాగ్రత్త వహించాలని సూచించింది.
 
పెళ్లిళ్లకు 50మంది, అంత్యక్రియలకు 20మంది మించరాదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. పాఠశాలలు, కళాశాలలు, బార్‌లు, సినిమా థియేటర్లు, ఈత కొలనులు, జంతు ప్రదర్శన శాలలు మూసే ఉంటాయని స్పష్టం చేసింది. 
 
సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలకు అనుమతించలేదు. అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను ఇంకా పునఃప్రారంభించకపోయినప్పటికీ పొరుగున ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి మాత్రం బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించారు.
 
దేశంలో కొవిడ్‌ కేసులు అత్యధికంగా నమోదైన నాలుగో రాష్ట్రం తమిళనాడు. శుక్రవారం అక్కడ 3039 కొత్త కేసులు, 69 మరణాలు నమోదయ్యాయి. గతంలో నమోదైన కేసులతో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 25.13 లక్షల కేసులు నమోదయ్యాయి. 
 
వీరిలో 24.46లక్షల మందికి పైగా కోలుకోగా, 33,322మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 33,224 క్రియాశీల కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 97శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.3శాతంగా నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.