త్వరలో హిడ్మా చరిత్ర కలిసిపోవాల్సిందే.... సీఆర్పీఎఫ్ చీఫ్ వార్నింగ్
మావోయిస్టు కమాండర్ మాద్వి హిడ్మాకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) చీఫ్ కుల్‌దీప్ సింగ్ గట్టివార్నింగ్ ఇచ్చారు. హిడ్మా లాంటివారు ఇకపై చరిత్రలో కలిసిపోవాల్సిందేనని హెచ్చరించారు.
గతవారం చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ - పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు అశువులుబాసిన విషయం తెల్సిందే. దీనిపై కేంద్రం గుర్రుగా ఉంది. ఈ దారుణానికి పాల్పడిన మావోయిస్టులను ఏరివేసేందుకు బీజాపూర్ అడవులను జల్లెడపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ హింసపై కుల్దీప్ స్పందిస్తూ, తర్వాత దశ ఆపరేషన్ల కోసం ఇప్పటికే తమ దగ్గర ప్రణాళికలు సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే వాళ్లకు పట్టున్న చాలా ప్రదేశాలను ఆక్రమించేసినట్లు చెప్పారు.
వాళ్లు ప్రస్తుతం ఓ చిన్న ప్రాంతానికే పరిమితమయ్యారు. వాళ్లను ఏరేయడం లేదంటే వాళ్లే పారిపోవడం ఒక్కటే మార్గం అని చెప్పారు. గతంలో 100 చదరపు కిలోమీటర్ల మేర మావోయిస్టులు ఉండేవాళ్లని, ఇప్పుడు అది 20 చదరపు కిలోమీటర్లకు పడిపోయిందని తెలిపారు. ఏడాదిలోపే ఆ చోట్ల కూడా వాళ్లు దాక్కున్న ప్రదేశాలను జల్లెడ పట్టి ఏరేస్తామని స్పష్టం చేశారు.
హిడ్మాలాంటి వాళ్లు సంగతేంటని అడగ్గా.. ఖచ్చితంగా చెప్పలేను కానీ అలాంటి వాళ్లు త్వరలోనే చరిత్రలో కలిసిపోతారు అని హెచ్చరించారు. 22 మంది భద్రతా సిబ్బందిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన ఘటన వెనుక కీలక సూత్రధారి హిడ్మానే కావడం గమనార్హం. సుక్మాకు చెందిన ఈ 40 ఏళ్ల హిడ్మా.. మావోయిస్టుల ప్రధాన దాడులలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం అతనే లక్ష్యంగా ఏరివేత సాగుతోంది.