మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మే 2020 (16:46 IST)

ఆంఫన్ తుఫాను తీరం దాటింది.. 4 గంటల పాటు చుక్కలు చూపించింది..

Rain
ఆంఫన్ తుఫాను తీరం దాటింది.. చెట్లు విరిగి పడి కరెంటు తీగలు తెగిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆంఫన్‌ తుపాను పశ్చిమ బెంగాల్‌లో తీరం తాకటం మొదలైందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ఊర్ధ్వ ఉపరితల ప్రాంతం పశ్చిమ బెంగాల్‌లో ప్రవేశించిందని, దిఘా పట్టణానికి తూర్పు ఆగ్నేయాన సుమారు 65 కి.మీ.ల దూరంలో ఇది తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ తుపాను తీరాన్ని తాకడం మొదలైందని, ఇది 4 గంటల పాటు కొనసాగుతుందని వివరించింది.
 
ఆంఫన్‌ తుపాను కారణంగా తీవ్రవేగంతో గాలులు వీస్తుండటంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్డీఆర్‌ఎఫ్‌) సిబ్బంది రంగంలోకి దిగారు. చెట్లు విరిగిపడి కరెంటు తీగలు తెగిన ప్రాంతాలలో వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఒడిశా సరిహద్దు, తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలోని దిఘా పట్టణానికి వెళ్లే రహదారిపై భారీ ఎత్తున చెట్టు విరిగిపడటంతో వాటిని తొలగించే పనిలో ఎన్డీఆర్‌ఎఫ్‌ నిమగ్నమైనట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ ట్విటర్‌లో వెల్లడించింది.