శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ - రేపే నైరుతి ఆగమనం
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు శుక్రవారం ప్రవేశిస్తాయని వెల్లడించింది. గత కొన్ని రోజులుగా దోబూచులాడుతూ ఇబ్బందులు పెట్టిన నైరుతి రుతపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయని, శుక్రవారం సాయంత్రానికల్లా ఇవి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత యేడాదితో పోల్చితే ఈసారి రుతపవనాల రాకలో వారం రోజుల పాటు జాప్యం జరిగింది.
ఇక తెలంగాణలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం నాడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లాలో బంట్వారంలో 5.1, నారాయణపేట్ జిల్లా దామరగిద్దలో 3.9 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.
మరోవైపు కరీంనగర్ జిల్లాలో గరిష్టంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.