1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (12:13 IST)

కన్న కుమారుడి ముందే తల్లిని వివస్త్రను చేసిన కిరాతకులు... ఎక్కడ?

Boy Attacked
దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు కలిసి ఓ దళిత యువకుడిని చావబాదారు. దీన్ని అడ్డుకోబోయిన ఆ యువకుడి తల్లిని వివస్త్రను చేసి కొట్టారు. ఈ దారుణం రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సాగర్ జిల్లాకు చెందిన నితిన్ ఆహిర్వార్ (18) అనే దళిత యువకుడి చెల్లిని గతంలో కొందరు వ్యక్తులు లైంగికంగా వేధించారు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో గురువారం నితిన్ ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు.. ఈ కేసును వెనక్కి తీసుకోవాలంటూ బెదిరించారు. అయితే, తాము కేసును ఉపసంహరించుకోమని నితిన్ సోదరి, తల్లి సష్టం చేశారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ వ్యక్తులు వారి ఇంటిని ధ్వంసం చేశారు. 
 
ఆ తర్వాత గ్రామంలోని బస్టాండ్ వద్ద ఉన్న నితిన్ దగ్గరకు వెళ్లి అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. అతని తల్లి, సోదరి అక్కడకు చేరుకుని, తమ బిడ్డను కొట్టొద్దంటూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఆ కిరాతకులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా యువకుడి తల్లిని కొట్టి, వివస్త్రను చేశారు. అక్కడ నుంచి నితిన్ సోదరి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన నితిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు ప్రధాన నిందితుడు విక్రమ్ సింగ్ ఠాకూర్‌తో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.