ఢిల్లీ పేలుళ్ళకు మా పనే : ఉగ్రసంస్థ జైష్ ఉల్ హింద్
ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన బాంబు పేలుళ్ళకు తామే కారణమంటూ ఉగ్రసంస్థ జైష్ ఉల్ హింద్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాగే, జైష్‌కు చెందిన టెలిగ్రామ్ ఛానల్‌లో ఈ మేరకు ప్రకటన వెలువడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) ప్రత్యేకంగా దృష్టిసారించింది.
ఇదిలావుంటే, ఈ పేలుడు ఘటనపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీ ఎన్‌ఐఏ కేంద్ర కార్యాలయంలో అధికారులు నేడు కీలక సమావేశం నిర్వహించారు. ఘటనపై విస్తృతంగా చర్చించారు. పేలుడు ఘటన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల క్రియాశీల సభ్యుల సమాచారం సేకరణకు ఎన్‌ఐఏ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
అంతేగాక, స్లీపర్ సెల్స్ వివరాలు సేకరించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్ఐఏ బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించింది. ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తును జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పర్యవేక్షిస్తున్నారు. అయితే పేలుడు వెనుక ఎవరున్నారన్నది ఇంకా తెలియరాలేదని ప్రభుత్వం తెలిపింది.
దేశ రాజధాని నడిబొడ్డులో శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో ఘటనాస్థలానికి 1.5 కిలోమీటర్ల దూరంలోని విజయ్ చౌక్‌లో గణతంత్ర వేడుకల ముగింపు కార్యక్రమం జరిగింది. అందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. అలాంటి అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో పేలుడు సంభవించడంతో దేశం ఉలిక్కిపడింది.