మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 24 మార్చి 2024 (11:12 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‍లో కేజ్రీవాల్ అరెస్టు.. జైలు నుంచే పాలన - కీలక ఆదేశాలు జారీ!!

arvind kejriwal
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసి తీహార్ జైలులో ఉంచారు. అయితే, ఈ స్కామ్‌లో తనను కక్షపూరితంగా ఇరికించారంటూ ఆయన ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జైలు నుంచే ఆయన పాలన ప్రారంభించినట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) వర్గాలు వెల్లడించాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీ నుంచే ఆయన ఆదివారం తొలిసారి ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిని ఓ నోట్‌ రూపంలో జలమంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న ఆతిశీ మార్లీనాకు ఆయన పంపించారు. నేటి ఉదయం దీనిపై ఆమె విలేకర్లకు మరింత సమాచారం ఇవ్వవచ్చని తెలుస్తోంది. 
 
ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతో మార్చి 21వ తేదీన కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. మనీలాండరింగ్‌ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. తర్వాత కోర్టు ఆయన్ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. కానీ, ఆయన ఇప్పటివరకు సీఎం పదవికి రాజీనామాను సమర్పించలేదు. లాకప్‌ నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్‌ వర్గాలు బలంగా చెబుతున్నాయి. 'మేము అంతకు ముందే చెప్పాము. కేజ్రీవాల్‌ ప్రభుత్వ పాలన కొనసాగిస్తారు. జైలు నుంచి పాలించకుండా ఏ చట్టమూ అడ్డుకోలేదు. ఆయన పై ఆరోపణలు రుజువుకాలేదు. అందుకే ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతారు' అని మంత్రి ఆతిశీ మార్లీనా వెల్లడించారు.
 
కేజ్రీవాల్‌ ఒకవేళ రాజీనామా ప్రకటిస్తే ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎంగా ప్రభుత్వాన్ని నడపొచ్చని సీనియర్‌ బ్యూరోక్రాట్‌, ఢిల్లీ మాజీ చీఫ్‌ సెక్రటరీ ఉమేశ్‌ సైగల్‌ తెలిపారు. జైలు మాన్యువల్‌ కూడా ఒక వ్యక్తి కారాగారం లోపలి నుంచి ప్రభుత్వాన్ని నడపడానికి అనుమతించదని స్పష్టం చేశారు.