గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (13:12 IST)

ఢిల్లీలో కరోనా విశ్వరూపం.. ఆరు రోజుల లాక్డౌన్.. నేటి అర్థరాత్రి నుంచే

దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విశ్వరూపం చూపుతోంది. కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. 
 
ఈ లాక్డౌన్ కూడా సోమవారం రాత్రి 10 గంటల నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ లాక్డౌన్ వచ్చే సోమవారం ఉదయం 5 గంటలతో ముగుస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. కరోనా కట్టడి కోసం చేపడుతున్న చర్యలను వివరించారు. అంతకుముందు లాక్డౌన్‌పై కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తో సమావేశమై చర్చించారు.
 
"ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా రోజుకు దాదాపు 25 వేల కేసుల వరకు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు, ఇన్‌ఫెక్షన్‌లు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. నిత్యం ఈ స్థాయిలో రోగులు వస్తే వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. 
 
ఈ ఆరు రోజుల లాక్డౌన్‌ కాలంలో ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచే చర్యలు చేపడతాం. ఈ లాక్డౌన్‌ కాలంలో ఆక్సిజన్‌, మందులు సమకూర్చే ఏర్పాట్లు చేస్తాం. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరుతున్నా. ఇలాంటి సమయంలో మాకు సాయం చేస్తున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా' అని కేజ్రీవాల్ తెలిపారు. 
 
అదేసమయంలో 'లాక్డౌన్‌లో భాగంగా నిత్యావసరాలు, ఆహార సంబంధిత, వైద్యం సహా ఇతర అత్యవసర సేవలు కొనసాగుతాయి. ప్రైవేటు కార్యాలయాలన్నీ వర్క్‌ ఫ్రం హోం ద్వారానే నడిపేలా చర్యలు తీసుకోవాలి. వివాహ వేడుకలు కేవలం 50 మందితో మాత్రమే జరుపుకోవాలి. అందుకు ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తాం. 
 
ఇక వలస కూలీల విషయానికొస్తే.. వారికి నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నా. ఇది ఆరురోజుల పాటు కొనసాగే చిన్న లాక్డౌన్‌ మాత్రమే. దయచేసి ఢిల్లీ వదిలి వెళ్లొద్దు. మళ్లీ దీన్ని పొడిగించాల్సిన అవసరం రాదని నేను భావిస్తున్నా. మిమ్మల్ని ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుంది' అని కేజ్రీవాల్‌ భరోసా కల్పించారు.  
 
కాగా, ఢిల్లీలో ఆదివారం 25,462 కరోనా కేసులు నమోదు కాగా, 161 మంది వైరస్‌ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం దిల్లీలో పాజిటివిటీ రేటు 30శాతంగా కొనసాగుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఢిల్లీలో వారాంతపు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.