శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జులై 2023 (13:28 IST)

మళ్లీ డేంజర్ మార్క్ దాటిన యమునా నది.. తాజ్‌మహల్ గోడలు తాకుతూ...

taj mahal
ఉత్తర భారతంలో వరుణ దేవుడు ఏమాత్రం శాంతించలేదు. దీంతో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల వరదలు సంభవించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. 
 
గత కొద్దిరోజులుగా ఈ నదీ ప్రవాహం తగ్గుముఖం పట్టగా.. బుధవారం ఉదయానికి నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటింది. ఢిల్లీలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యమునమ్మ ఉప్పొంగుతోందని అధికారులు తెలిపారు. ఒక దశలో ఆగ్రాలోని ప్రేమసౌథం తాజ్‌ మహల్ ప్రహరీ గోడలను తాకుతూ వరద నీరు ప్రవహించింది. 
 
మరోవైపు, ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాల ముప్పు పొంచివుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జులై 22 వరకు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. అటు ఢిల్లీలోనూ మోస్తరు వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.
 
గుజరాత్‌లోనూ రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. గిర్‌ సోమ్‌నాథ్‌, కచ్‌, నవ్‌సరి, వల్సాద్‌, అమ్రేలీ, రాజ్‌కోట్‌ జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను రంగంలోకి దింపింది. ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.