గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 ఆగస్టు 2020 (19:01 IST)

ఢిల్లీలో 24 నుంచి భవన కార్మికుల వివరాల నమోదు: మంత్రి గోపాల్ రాయ్

దేశ రాజధాని ఢిల్లీలో భవన నిర్మాణ కార్మికుల వివరాల నమోదుకు ఓ మెగా క్యాంపైన్‌ను చేపట్టనుంది. ఈ వివరాలన నమోదు కార్యక్రమం ఆగస్టు 24వ తేదీ నుంచి సెప్టెంబరు 11వ తేదీ వరకు జరుగనుంది. ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో భవన కార్మికులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని ఢిల్లీ కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ భవన కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ రాజధానిలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతుందన్నారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 11వ తేదీ వరకు జరిగే ఈ వివరాల నమోదు ప్రక్రియ శిబిరాల్లో భవన నిర్మాణ కార్మికులు ఢిల్లీ బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సరైన పత్రాలు ఇస్తే అక్కడికక్కడే రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
 
"70 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కో ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుల నమోదు కోసం స్థానిక పాఠశాలలో ఒక క్యాంపు ఏర్పాటు చేస్తామని, స్థానిక ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు, పీడబ్ల్యూడీ, ఎంసీడీ, వరద, నీటిపారుదల శాఖ వంటి ఏజెన్సీల ఇంజినీర్లు ఈ శిబిరాల్లో పాల్గొంటారని తెలిపారు. కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలని విలేకరుల సమావేశంలో సూచించారు. 
 
బోర్డు లాక్డౌన్‌ కాలంలో రెండు నెలల పాటు సుమారు 40 వేల మంది కార్మికులకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు రాయ్‌ చెప్పారు. కార్మికుల నమోదుతో పిల్లలకు విద్య, వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు, వృద్ధాప్య పింఛను, రిజిస్టర్డ్‌ నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా వంటి సంక్షేమ చర్యలను కూడా చేపడుతుందని కార్మిక మంత్రి గోపాల్ రాయ్ వివరించారు.