సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 అక్టోబరు 2018 (18:53 IST)

రైలు పట్టాలపై కూర్చుని మద్యం సేవించారా? ఆ ముగ్గురు?

రైలు పట్టాలను దాటడమే ప్రమాదం, నేరమని రైల్వే శాఖ ఎన్ని ప్రకటనలు చేసినా.. పట్టాలు దాటడాన్ని ప్రయాణీకులు ఏమాత్రం విడిచిపెట్టట్లేదు. దీంతో రైలు ప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇటీవలే అమృత్ సర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమృతసర్ ప్రమాదం అనుకోకుండా జరిగింది. కానీ తాజా ఘటన మద్యం మత్తులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నంగ్లోయి రైల్వేస్టేషన్ సమీపంలో ఢిల్లీ-బికనీర్ మార్గంలో ముగ్గురు వ్యక్తులపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ సమయంలో రైల్వే పట్టాలపై మద్యం సేవిస్తూ ఉండడంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని డీసీపీ దినేష్ గుప్తా అనుమానిస్తున్నారు. 
 
లేకుంటే వారు మద్యం మత్తులో రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో ఇలా జరిగి ఉండవచ్చని చెప్తున్నారు. ప్రమాద సమయానికే ముగ్గురు వ్యక్తులు విపరీతమైన మద్యం మత్తులో ఉన్నారని డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.