శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (11:01 IST)

బిడ్డ శవాన్ని భుజంపై వేసుకుని మోసుకుంటూ వెళ్లిన తల్లి...

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పాషాణ హృదయులుగా మారిపోయారు. ఆంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఓ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ తర్వాత ఆ బిడ్డ శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకుసైతం ఆంబులెన్స్ ఇవ్వలేదు. దీంతో బిడ్డ శవాన్ని భుజం వేసుకుని మోసుకుంటూ వెళ్లిపోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాహజాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ... తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. ఆ బాలుడుని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని ఇతర ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే, తమ దగ్గర చిల్లి గవ్వలేకపోవడంతో అంబులెన్స్‌ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని కాళ్లవేలా ప్రాధేయపడింది. కానీ, వైద్యులు మాత్రం నిరాకరించారు. 
 
దీంతో చేసేదేంలేక తన కొడుకును భుజాలపై వేసుకుని నడక సాగించామన్నారు. 'నా భుజాలపై ఉన్న నా బిడ్డ మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రివారు అంబులెన్స్‌ ఇచ్చి ఉంటే తన కొడుకు బతికేవాడని' అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆసుపత్రి ముందు మూడు అంబులెన్స్‌లు పార్క్‌ చేసి ఉన్నాయని, అయినా తమకు ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదన్నారు. అయితే ఆ దంపతుల ఆరోపణలను ఆస్పత్రి వైద్యులు తోసిపుచ్చారు. ఆ మహిళ అసత్య అరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు.