మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (16:22 IST)

పెరోల్‌పై విడుదలకానున్న డేరాబాబా - నెల రోజుల పాటు ఆశ్రమంలోనే...

dera baba
తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్టు వచ్చిన నేరారోపణల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆధ్యాత్మిక గురువు డేరా బాబాకు 20 యేళ్ల జైలుశిక్ష విధించింది. డేరా సచ్ఛా సౌదా మేనేజర్ రంజిత్ సింగ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో కూడా ఆయనకు కోర్టు శిక్ష విధించింది. అలాగే మరికొన్ని కేసుల్లో కూడా ఆయన శిక్షను అనుభవిస్తున్నారు. డేరాబాబాకు గత 2017లో జైలుశిక్ష పడింది. అప్పటి నుంచి ఆయన జైలు జీవితాన్నే గడుపుతున్నారు. 
 
అయితే, వివిధ కారణాలు చెబుతూ పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి వెళుతున్నారు. ఈ యేడాది ఫిబ్రవరి నెలలో కూడా పెరోల్‌పై వచ్చిన ఆయన రెండు వారాల పాటు బయటే ఉన్నారు. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులను మినహా ఇతరులను కలవరాదని కోర్టు ఆంక్షలు విధించింది. అలాగే, తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెకు సేవ చేసేందుకు కూడా డేరా బాబాకు పలుమార్లు పెరోల్ లభించింది. 
 
తాజాగా మరోమారు నెల రోజుల పెరోల్ లభించింది. ఈసారి ఆయన ఉత్తరప్రదేశ్, బర్నావాలోని తన ఆశ్రమమైన డేరా సచ్ఛా సౌదాకు వెళ్లారు. అక్కడ నెల రోజుల పాటు ఉంటారు. ఈ సందర్భంగా ఆయన జడ్ కేటగిరీ భద్రత ఉంటుంది. ఖలిస్తాన్ అనుకూల వ్యక్తుల నుంచి ఆయనకు ముప్పు పొంచివున్నందున డేరా బాబాకు ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రతను కల్పించిన విషయం తెల్సిందే. కాగా, తాజాగా కోర్టు ఆయనకు పెరోల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది.