గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జులై 2020 (09:06 IST)

హత్యలు చేయడంలో సెంచరీ : సీరియల్ కిల్లర్ వైద్యుడు అరెస్టు

ట్రక్, టాక్సీ డ్రైవర్లే లక్ష్యంగా చేసుకుని ఏకంగా వంద మందిని చంపేసిన సీరియల్ కిల్లర్ వైద్యుడు డాక్టర్ దేవేంద్ర శర్మ (62)ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ వైద్యుడు కేవలం హత్యలు మాత్రమే కాదు.. ఏకంగా 125 మందికి అక్రమంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను కూడా చేశాడు. ఆయనపై అనేక చీటింగ్, కిడ్నాప్, హత్య కేసులు కూడా ఉన్నాయి. అలాంటి సీరియల్ కిల్లర్ వైద్యుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీఏఎంఎస్ మాత్రమే చదివిన దేవేంద్రశర్మ కిడ్నీలు తొలగించడంలో మహా దిట్ట. ట్రక్ డ్రైవర్లను చంపి వారి మృతదేహాలను కాస్గంజ్ సమీపంలోని హజా కాలువలో మొసళ్లకు ఆహారంగా వేసి ఆధారాలు మాయం చేసేవాడు. అనంతరం వాహనాలను కాస్గంజ్‌లో అమ్మేవాడు. లేదంటే తుక్కుగా మార్చి మీరట్‌లో అమ్మి సొమ్ము చేసుకోసాగాడు. 
 
అంతేకాకుండా, అతడో కిడ్నీరాకెట్ సూత్రధారి కూడా. దేశంలోని పలు రాష్ట్రాల్లోని కిడ్నీ రాకెట్‌తో సంబంధాలున్నాయి. వైద్యం కోసం తన వద్దకు వచ్చిన వారి నుంచి వారికి తెలియకుండా కిడ్నీలు తొలగించి విక్రయించేవాడు. ఇలా దాదాపు 125 మందికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశాడు. ఒక్కో కేసులో రూ.5 నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేసేవాడు. 
 
ఈ క్రమంలో ఓ హత్య కేసులో పట్టుబడి జీవిత ఖైదు అనుభవిస్తున్న డాక్టర్ శర్మ ఈ యేడాది జనవరిలో 20 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చి ఢిల్లీలోని బాప్‌రైలాకు పారిపోయి దాక్కున్నాడు. అక్కడ ఓ వితంతువును పెళ్లాడి ఆమెతో జీవిస్తున్నాడు. అతడి కోసం గాలిస్తున్న జైపూర్ పోలీసులకు శర్మ గురించి ఈ విషయాలు తెలిశాయి. దీంతో వారు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించగా వారు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
 
 
కాగా, ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో నిందితుడిని తీసుకెళ్లేందుకు జైపూర్ పోలీసులు ఢిల్లీ బయలుదేరారు. శర్మపై పలు చీటింగ్, కిడ్నాప్ కేసులు కూడా నమోదైనట్టు పోలీసులు తెలిపారు. కిడ్నీ రాకెట్ కేసులో 2004లో శర్మతో పాటు పలువురు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.