మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (22:56 IST)

అలా చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు: నితిన్‌ గడ్కరీ

దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ కీలక సూచన చేశారు. కమర్షియల్‌ ట్రక్కు డ్రైవర్లకు నిర్దిష్టమైన పనిగంటలు అమలు చేయాలన్నారు.

పైలట్ల మాదిరిగానే ట్రక్కు డైవర్లకు కూడా నిర్దిష్టమైన పని గంటలు నిర్ణయిస్తే.. అలసట కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మంగళవారం గడ్కరీ వరుస ట్వీట్లు చేశారు.
 
యూరోపియన్ ప్రమాణాలతో సమానంగా కమర్షియల్‌ వాహనాల్లో ఆన్-బోర్డ్ స్లీప్ డిటెక్షన్ సెన్సార్‌లను ఏర్పాటు చేసే విధానంపై పనిచేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. జిల్లా రహదారి కమిటీ సమావేశాలు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా జరిగేలా దేశంలోని ముఖ్యమంత్రులు, జిల్లా కలక్టర్లకు లేఖలు రాయనున్నట్టు పేర్కొన్నారు.

జాతీయ రహదారి భద్రతా మండలి (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)కి నామినేట్‌ అయిన సభ్యుల పరిచయ కార్యక్రమంలో ఈ ఉదయం పాల్గొన్న గడ్కరీ.. ప్రతి రెండు నెలలకోసారి ఈ మండలి సమావేశం కావాలని సూచించారు. ఈ సమావేశంలో మరో కేంద్రమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ కూడా పాల్గొన్నారు.