శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (09:15 IST)

వధువు చేయిపట్టిలాగి పెళ్లిని చెడగొట్టిన వరుడి స్నేహితులు.. ఎక్కడ?

పెళ్లి వరుడు స్నేహితులు చేసే హంగామా అంతాఇంతా ఉండదు. ఆ స్నేహితులు చేసిన అతి కారణంగా ఓ పెళ్లి రద్దు అయింది. పెళ్లితో తమతో పాటు డ్యాన్స్ చేయాల్సిందిగా వధువు చేయి పట్టుకుని కొందరు ఫ్రెండ్స్ లాగారు. అంతే.. వధువుకు చిర్రెత్తుకొచ్చింది. పెళ్ళి కుమారుడిని చెడామడా తిట్టేసి... పెళ్లి పీటలపైనుంచి లేచిపోయింది. ఈ హఠాత్ పరిణామంతో పెళ్లికి వచ్చిన ఆహ్వానితులంతా బిక్కమొహమేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బరేలి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడుకి, కన్నౌజ్ జిల్లాకు చెందిన ఓ యువతికి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లి కోసం వధువు కుటుంబ సభ్యులు శుక్రవారం బరేలీ చేరుకున్నారు. పెళ్లి వేడుక బ్రహ్మాండంగా జరుగుతున్న వేళ వరుడి స్నేహితులు కళ్యాణమండపంలోకి అడుగుపెట్టారు. తమతో కలిసి డ్యాన్స్ చేయాలంటూ వధువు చేయి పట్టుకుని డ్యాన్స్‌ఫ్లోర్ పైకి లాగారు.
 
వరుడు ఫ్రెండ్స్ చేసిన అతి వధువుకు నచ్చలేదు. ఈ హఠాత్ పరిణామంతో విస్తుపోయిన పెళ్లికుమార్తె ఆగ్రహంతో పెళ్లిపీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. ఆమెకు తల్లిదండ్రులు కూడా అండగా నిలవడంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. 
 
అలాంటి వాడితో పెళ్లేంటంటూ వధువు తండ్రి ముఖం మీదే కొట్టినట్టు చెప్పి అక్కడి నుంచి కుమార్తెను తీసుకుని ఇంటికి బయలుదేరారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. 
 
అంతేకాదు, వరుడి కుటుంబంపై వరకట్న కేసు కూడా నమోదైంది. దీంతో దిగొచ్చిన పెళ్లి కొడుకు బంధువులు రూ. 6.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, ఇరు కుటుంబాలు ఓ ఒప్పందానికి వచ్చాయని పోలీసులు తెలిపారు. 
 
అయితే, ఆదివారం వధువు కుటుంబ సభ్యులను కలిసిన వరుడి కుటుంబ సభ్యులు పెళ్లి కోసం ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా పెళ్లి తంతు కానిద్దామని బతిమాలారు. 
 
కానీ వధువు మాత్రం ససేమిరా అంది. ఆ ఘటన తనను తీవ్రంగా వేధించిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాబోయే భార్యను గౌరవించని వ్యక్తితో పెళ్లి జరిపించే ప్రసక్తే లేదని వధువు తండ్రి తేల్చి చెప్పారు.