11 రోజుకు రైతుల ఆందోళన - కేంద్రం - రైతుల ఉడుంపట్టు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఆదివారానికి 11వ రోజుకు చేరింది. రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరగుతున్నది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దులకు తరలివస్తున్నారు.
దేశ రాజధాని శివార్లలోని సింఘ, టిక్రీ, జరోదా, ఘాజీపూర్, నోయిడా సరిహద్దుల్లో రైతు సంఘాలు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలతోపాటు, విద్యుత్ బిల్లు-2020ని రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు.
మరోవైపు, రైతు సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం శనివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈనెల 9న మరోమారు రైతు నాయకులతో సమావేశమవుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసగా రైతు సంఘాలు ఈనెల 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం.
ఇదిలావుంటే, రోజు రోజుకు ఆందోళనలు ఉధృతమతుండటంతో కేంద్ర ప్రభుత్వం రైతులతో ఇప్పటికే ఐదుసార్లు సమావేశమయ్యింది. అయినప్పటికీ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. కాగా, వ్యవసాయ చట్టాలను ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తీసుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతున్నది. ఇప్పటికే ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించాయి.
అంతర్జాతీయంగా కూడా రైతులకు మద్దతు లభిస్తున్నది. ఇప్పటికే కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో రైతుల పక్షాన నిలిచారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు కెనడా ఎప్పుడూ మద్దతిస్తుందని ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి కూడా నిరసన తెలపడం ప్రజల హక్కు అని ప్రకటించింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు.
అదేవిధంగా రైతుల నిరసన విషయంలో బ్రిటన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎంపీలు ఆ దేశ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ కోరారు. ఈమేరకు పార్టీలకతీతంగా 38 ఎంపీలు మంత్రికి లేఖ రాశారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడాలని అందులో కోరారు.
ఈ నెల 8న భారత్ బంద్ పాటించాలంటూ రైతులు ఇచ్చిన ఆర్జేడీ, తృణమూల్, డీఎంకే, వామపక్షాలు,10 కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక మద్దతు ప్రకటించింది. రైతుల నిరసనోద్యమంపై బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న విద్వేష ప్రచారాన్ని వామపక్షాలు ఖండించాయి.