శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 23 మే 2015 (08:50 IST)

ఫట్... ఫట్... షూటింగ్ ఏరియాలో కాల్పులు.. అమితాబ్ కు తప్పిన ప్రమాదం

ఒకవైపు బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్ జరుగుతోంది. రెండు గ్యాంగులు అక్కడకు చేరుకున్నాయి. కనీసం 20 అడుగుల దూరం కూడా లేదు. ఫట్ ఫట్ అంటూ కాల్పులు జరిపాయి. ఇది చూసి అందరూ బిత్తరపోయారు. వెంటనే అమితాబ్ ను అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్ళారు. ముంబయి ఫిలింసిటీలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
ఫిలిం సిటీలో బిగ్ బి షూటింగ్ కు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన కాల్పులు ముంబైలో సంచలనం రేపాయి. ముంబై ఫిల్మ్ సిటీలో  ఫిల్మ్ సిటీలోని కాళియా మైదాన్ లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో రాజు షిండే అనే సెక్యురిటీ కాంట్రాక్టర్ గాయపడ్డాడు. రెండు  బైకులపై వచ్చిన దుండగులు ఈ కిరాతకానికి ఒడిగట్టారు.
 
దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా, ఒక బుల్లెట్ రాజు షిండే పొట్టలో దిగింది. అతడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దుండగులు ఒక బైకును సంఘటనా స్థలంలో వదిలేసి పారిపోయారు. తాము షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి 20 అడుగుల దూరంలో ఈ గ్యాంగ్ వార్ జరిగిందని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.