మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (17:15 IST)

నువ్వంటే నాకిష్టం లేదన్నందుకు.. గొంతుపిసికి చంపేసిన ప్రేమోన్మాది...

నువ్వంటే నాకిష్టంలేదు అన్నందుకు ఓ యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన యువకుడే కాలయముడై, ఆ యువతి గొంతు పిసికి చంపేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక ఫిరోజాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ 18 యేళ్ళ యువతిని అదే ప్రాంతానికి చెందిన పవన్ అనే యువకుడు ప్రేమించసాగాడు. ఈ విషయాన్ని ఆ యువతికి కూడా పలుమార్లు చెప్పాడు. కానీ, ఆ యువతి పట్టించుకోలేదు. 
 
ఈ క్రమంలో గత శుక్రవారం పొలంపనులు చేసుకుంటున్న తన తల్లిదండ్రులకు భోజనం ఇచ్చి ఇంటికి తిరిగివస్తోంది. ఆ సమయంలో అడ్డుపడిన ఆ ప్రేమికుడు.. ఆ యువతిని బలవంతం చేయబోయాడు. అపుడు నువ్వంటే నాకిష్టంలేదు.. నేను ప్రేమించలేనని తెగేసి చెప్పింది. 
 
ఈ మాటలు విన్న ఆ ప్రేమోన్మాదికి కోపం కట్టలు తెంచుకుంది. అంతే.. ఆ యువతిని గొంతు పిసికి చంపేసి పారిపోయాడు. అయితే, తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
అయితే, యువతి శవం కనిపించకుండా చేయాలని భావించిన పవన్ హత్యా స్థలానికి వచ్చాడు. ఇంతలో స్థానికులు ఆ యువకుడిని గుర్తించి, పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.