చట్టంతో ఆటలా... చిద్దూ తనయుడుకి సుప్రీంకోర్టు హెచ్చరిక

karthi chidambaram
వాసు| Last Updated: గురువారం, 31 జనవరి 2019 (13:03 IST)
ఎంతటి వారైనా మాజీలైతే... వారి పరిస్థితి ఎలా ఉంటుందో తాజాగా జరిగిన సంఘటన ఉటంకిస్తోంది. చట్టంతో ఆటలాడొద్దని, దర్యాప్తు సంస్థలకు సహకరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మాజీమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను సుప్రీంకోర్టు హెచ్చరించింది. కార్తీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించి విదేశీ పర్యటనకు బుధవారం అనుమతిచ్చిన కోర్టు.. ఎయిర్‌టెల్‌ మాక్సిస్‌ కేసులో మార్చి నెల 5, 6, 7 మరియు 12 తేదీలలో విచారణ నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ఇడి) ఎదుట హాజరుకావలసిందిగా ఆదేశించింది.

తీర్పు ఇచ్చిన చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌గగోయ్.. కార్తీని ఉద్దేశించి, 'మీరు ఎక్కడికైనా వెళ్లండి, ఏదైనా చేయండి, కానీ చట్టంతో ఆటలాడొద్దు. సరిగ్గా సహకరించకపోతే.. కఠిన చర్యలు తప్పవు అంటూ వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటనకుగానూ 10 కోట్ల రూపాయల మొత్తాన్ని డిపాజిట్‌ చేయవలసిందిగా అపెక్స్ కోర్టు ఆదేశించింది. అయితే కార్తీ విచారణకు సహకరించడం లేదంటూ ఆయన విదేశీ పర్యటన అనుమతించరాదని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసులో కార్తీతోపాటు ఆయన తండ్రి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.
దీనిపై మరింత చదవండి :