1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మార్చి 2024 (17:59 IST)

ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమించిన కేంద్ర మాజీ మంత్రి

central minister harshavardhan
కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎంపీ డా.హర్షవర్థన్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇకపై ఢిల్లీ కృష్ణానగర్‌లోని తన క్లినిక్‌లో వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఢిలోని చాందినీ చౌక్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించారు. భాజపా శనివారం ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
 
'50 ఏళ్ల క్రితం కాన్పూర్‌లోని జీఎస్‌వీఎమ్‌ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరినప్పుడు పేదలకు సాయం చేయాలనేది నా ఆశయం. ఆరెస్సెస్‌ సూచన మేరకు రాజకీయాల్లోకి వచ్చాను. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా, కేంద్ర ఆరోగ్య మంత్రిగా నా హృదయానికి దగ్గరగా ఉన్న పని చేశాను. పోలియో రహిత భారత్‌ కోసం, కరోనా రెండు విడతల్లో దేశ ప్రజలను కాపాడేందుకు నా వంతు కృషి చేశాను. ఇన్నేళ్ల నా రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు. ప్రధాని మోడీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నా' అని ట్వీట్ చేశారు. 
 
ఈఎన్‌టీ వైద్యుడైన డా.హర్షవర్థన్‌.. 1993లో తొలిసారి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా నగర్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అనంతరం ఢిల్లీ ఆరోగ్య శాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే స్థానం నుంచి ఆయన వరుసగా ఆరుసార్లు (1993, 96, 98, 2003, 2008, 2013) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మోడీ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టారు. 2021లో జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు. కరోనా సమయంలో దేశంలో వైరస్‌ను కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించారు.