గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (11:24 IST)

ఉరిశిక్షను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని మీరట్ తలారికి ఆదేశం

నిర్భయ దోషులకు ఉరిశిక్షలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని మీరట్ జైలు తలారీని సంబంధింత జైలు శాఖ అధికారురులు కోరారు. వాస్తవానికి ఈ నలుగురు దోషులను ఉరితీసేందుకు ఇద్దరు తలారీలను తీహార్ జైలు అధికారులు కోరారు. ఈ మేరకు వారు ఉత్తరప్రదేశ్ జైళ్ళ శాఖ అధికారులకు లేఖ రాసినట్టు యూపీ జైళ్లశాఖ అదనపు డీజీ ఆనంద్‌కుమార్‌ వెల్లడించారు. 
 
అయితే, 'ఇద్దరు తలారీలు కావాలని తీహార్‌ జైలు అధికారులు కోరారు. కానీ లక్నో జైలు తలారీ అనారోగ్యంగా ఉన్నాడు. మీరట్‌ జైలు తలారీని ఉరిశిక్ష అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరాం' అని వివరించారు. 
 
ఈ నేపథ్యంలో మీరట్‌ జైలు తలారీ పవన్‌ జల్లాద్‌ జాతీయ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ, తన తాత కల్లు జల్లాద్‌ గతంలో ఇందిరాగాంధీని దారుణంగా హత్య చేసిన ఇద్దరు దోషులను ఉరి తీశాడని శుక్రవారం తెలిపారు. 
 
'మీరట్‌ జైలు అధికారులు అడిగితే నిర్భయ కేసులో దోషులను ఉరితీసేందుకు నేను సిద్ధం. ఇప్పటికైతే నాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. కానీ ఆదేశించిన 24 గంటల్లోపు విధులు నిర్వర్తించేందుకు నేను సిద్ధం. నా తాత కల్లు, తండ్రి బబ్బు కూడా తలారీలుగా పనిచేశారు. ఐదుగురిని ఉరి తీయడంలో నా తాతకు నేను సాయం చేశా. 
 
ఉరిశిక్ష అమలుకు ముందు రెండు నుంచి మూడు గంటలు అసలు ఏర్పాట్లు జరుగుతాయి. ముందు నేను ఉరితాడు గట్టిగా ఉందా? లేదా? అన్న సంగతి తనిఖీ చేయాలి. ఉరిశిక్ష అమలు చేసే వేదికను పరిశీలించాలి' అని వెల్లడించారు. అతి క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష అమలు చేసేందుకు తనపై ఎటువంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.