1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2017 (17:15 IST)

గుర్మీత్ సింగ్ దోషే... అట్టుడుకుతున్న పంజాబ్ - హర్యానా... 11 మంది మృతి

గత 2002 సంవత్సరంలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఆయనకు సో

గత 2002 సంవత్సరంలో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఆయనకు సోమవారం శిక్షను ఖరారు చేయనుంది. గుర్మీత్ సింగ్‌కు గరిష్టంగా ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. కోర్టు తీర్పు అనంతరం రామ్ రహీమ్ సింగ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని అంబాలా జైలుకు తరలించారు. 
 
గుర్మీత్ సింగ్ రేప్ కేసు తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. డేరా సచ్చా సౌదాకి లక్షల సంఖ్యలో అనుచరులు ఉన్నారు. అందులో మహిళలు, బాలికలే ఎక్కువ కావడం గమనార్హం. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఇతనికి మద్దతుదారులు ఎక్కువ. ఈ క్రమంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి, కర్ఫ్వూ విధించారు. 
 
ఈ రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా డేరాబాబా కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. మీడియా వాహనాలపై, జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులపైకి డేరా బాబా కార్యకర్తలు పలు చోట్ల రాళ్ళు విసిరారు. డేరాబాబా అనుచరులను అదుపు చేసేందుకు రెండు రాష్ట్రాల్లో సైన్యం రంగంలోకి దిగింది. పలుచోట్ల కాల్పులు, లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే 11 మందివరకు మరణించగా, మరో 200 మంది వరకు గాయపడినట్టు సమాచారం. 
 
కాగా, హర్యానాలో 75, పంజాబ్‌లో 35 కంపెనీల భద్రతా బలగాలను రంగంలోకి దించారు. పంజాబ్, హర్యానాలోని సున్నిత ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలు, డేటా సేవలను నిలిపివేశారు. బస్సు, రైళ్లు సర్వీసులను రద్దు చేశారు. ముందస్తు జాగ్రత్తగా రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 
 
భారీ బందోబస్తు ఉన్నప్పటికీ.. పంజాబ్‌లో రెండు రైల్వే స్టేషన్లతో పాటు ఓ పెట్రోల్ బంక్‌కు గుర్మీత్ మద్దతుదారులు నిప్పు పెట్టారు. ఆశ్రమం వద్ద ఉన్న రెండు వాహనాలకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పంజాబ్‌లో రామ్ మద్దతుదారులు.. రోడ్లపై కర్రలు పట్టుకుని హల్ చల్ చేస్తున్నారు. పలుచోట్ల భారీ సంఖ్యలో గుమిగూడి ఆందోళనలకు యత్నిస్తున్నారు. 
 
దీంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు అట్టుడికి పోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న శాంతిభద్రతలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా ఎప్పటికపుడు పరిస్థితులను తెలుసుకుంటూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలని ఆయన విజ్ఞప్త చేశారు.