మూడు రోజుల శిశువును ఎత్తుకెళ్లిన కుక్క... ఎక్కడంటే?
హర్యానాలోని పానిపట్టులో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన జరిగింది. మెటర్నరీ ఆస్పత్రిలోకి వెళ్లిన కుక్క తల్లి పొత్తిళ్లలో ఉన్న మూడు రోజుల శిశువును ఎత్తుకెళ్లాయి. కాగా ఆ శిశువు తీవ్ర గాయాలపాలై మృతి చెందింది.
పానిపట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో షబ్నం అనే మహిళ మూడు రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఆసుపత్రిలోకి ప్రవేశించిన కొన్ని శునకాలు ఆ తల్లి పక్కన ఉన్న శిశువును నోట కరుచుకుని వెళ్లాయి. ఆ సమయంలో తల్లి షబ్రం సహా ఇద్దరు బంధువులు నిద్రలో ఉన్నారు.
రాత్రి 2.15 గంటల సమయంలో తల్లి లేచి చూడగా బిడ్డ కనిపించలేదు. ఈ విషయాన్ని వెంటనే ఆస్పత్రికి యాజమాన్యానికి తెలియజేశారు. దీంతో అలర్టైన ఆసుపత్రి సిబ్బంది, శిశువు బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు.
అయితే హాస్పిటల్ సమీపంలో ఉన్న ఓ ప్రాంతంలో ఓ కుక్క శిశువును నోట కరుచుకుని ఉండడం గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, అప్పటికే శిశువు తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.