దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండలు.. 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పంజాబ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు మినహా ఇతర ప్రాంతాల్లో మాత్రం మరింతగా నిప్పులు చెరుగుతున్నాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో 45 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా కంటే దాదాపు 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
అయితే, భారత వాతావరణ శాఖ మాత్రం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వెస్టర్న్ డిస్ట్రబెన్స్ యాక్టివ్ కావడంతో వాయవ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు నుంచి ఉపశమనం లభిస్తుంది. పంజాబ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లపై దట్టమైన మేఘాల కదలికలు కనిపిస్తుండటంతో వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు సమీపంలో ఉన్నట్టు వివరించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్, హమీర్పూర్‌లలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో 43.2 డిగ్రీల, కోటాలో42.8 డిగ్రీలు, బన్సవారాలో 42.7, అల్వార్‌లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బీహార్ పాట్నాలో 44.1 డిగ్రీలు, షేక్‌పూర్‌లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాదు వచ్చే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.