మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (10:02 IST)

నమ్మించి వేటకొడవళ్ళతో నరికి ప్రాణాలతో కావేరి నదిలో పడేశారు...

తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె తమ కంటే తక్కువ కులం యువకుడుని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో కుమార్తెతో పాటు.. అల్లుడుని నమ్మించి వేటకొడవళ్ళతో ముక్కలు ముక్కలుగా నరికి, కొనఊపిరితో ఉండగానే కావేరీ నదిలో తోసేశారు. ఈ పరువు హత్య తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణగిరి జిల్లా సూడుకొండపల్లికి చెందిన శ్రీనివాసన్‌ అనే వ్యక్తి కుమార్తె స్వాతి. ఈమె బీకామ్ పూర్తి చేసింది. అదే ప్రాంతానికి చెందిన నందీశ్ (25) అనే యువకుడిని ప్రేమించింది. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో గత ఆగస్టు 15వ తేదీన ఇంటి నుంచి పారిపోయి నందీశ్‌ను పెళ్లి చేసుకుంది. నందీశ్‌ తాను పనిచేస్తున్న దుకాణంపై ఉన్న ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. 
 
అయితే, తమకంటే తక్కువ కులం యువకుడుని పెళ్లి చేసుకోవడాన్ని శ్రీనివాసన్ జీర్ణించుకోలేక పోయాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరినీ మట్టుబెట్టేందుకు పథకం వేసుకున్నాడు. గత నెల 10వ తేదీన శ్రీనివాసన్‌, అతడి సోదరుడు వెంకటేశ్‌ తదితరులు నందీశ్‌ ఇంటికి వెళ్లి వారి ప్రేమ వివాహాన్ని అంగీకరిస్తున్నామని నమ్మించారు. పైగా, ఇంటి అల్లుడుకి బంగారు ఉంగరం కూడ కానుకగా ఇచ్చారు. దీంతో వారి మాటలను స్వాతి దంపతులు గుడ్డిగా నమ్మేశారు.
 
ఈ క్రమంలో శ్రీనివాసన్, వెంకటేశ్, వీరి బంధువు కృష్ణన్‌లు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కారు తీసుకుని స్వాతి ఇంటికెళ్లారు. అక్కడ నుంచి తమ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చినట్టుగా నమ్మించి కారు ఎక్కించుకున్నారు. అక్కడ నుంచి నేరుగా కర్నాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలోని అటవీ ప్రాంతానికి వారిద్దరినీ తీసుకెళ్లారు. అక్కడ వేటకొడవళ్లతో కుమార్తెను అల్లుడుని ముక్కలుగా నరికేశారు. 
 
ఆ తర్వాత వారిద్దరూ ప్రాణాలతో ఉండగానే కావేరీ నదిలో తోసేశారు. ఈ ఘటనపై నందీశ్‌ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ జంట పరువు హత్యలకు పాల్పడిన స్వాతి తండ్రి శ్రీనివాసన్‌, వెంకటేశ్‌, బంధువు కృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.