1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (18:22 IST)

మోడీకి జయలలిత ప్రేమ లేఖ: శ్రీలంక రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో ఫోటోలు!

శ్రీలంక రక్షణ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కించ పరిచేలా ఓ ఫోటోలతో పాటు.. కామెంట్స్ పొందుపరిచారు. ఈ ఫోటోలు తమిళనాడులో సంచలనం సృష్టించగా, ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ జాలర్ల అంశంపై ప్రధానికి రాసే లేఖలను నరేంద్ర మోడీకి జయలలిత రాస్తున్న ప్రేమ లేఖలు అనే అర్థం వచ్చేలా అందులో కామెంట్స్ పోస్ట్ చేశారు. 
 
షెనాణి డి విడుకే అనే వ్యక్తి రాసిన ఆ కామెంట్స్ పూర్తి సారాంశం ఇలా వుంది. 'శ్రీలంక ప్రభుత్వం నిర్వహించిన చేసిన భద్రతా కౌన్సిల్‌లో పాల్గొనేందుకు వచ్చిన సుబ్రమణ్య స్వామితో పాటు భారత బృందం, భారత్ - శ్రీలంక సంబంధాల్లో తమిళనాడు జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. పైపెచ్చు.. తమిళనాడు జాలర్లను విడుదల చేయాల్సిందిగా వారు లంక అధిపతి రాజపక్సేకు విజ్ఞప్తి చేశారు. వీరు చెపుతున్న వాదన మేరకు.. తమిళనాడు జాలర్లు శ్రీలంక సముద్ర జలాల్లోకి హద్దుమీరి వస్తూ చేపల వేట సాగిస్తున్నారనే విషయాన్ని జయలలిత తోసిపుచ్చలేరని పేర్కొన్నారు. 
 
అందువల్ల తమిళ జాలర్ల అంశాన్ని అడ్డుపెట్టుకుని మోడీకి జయలలిత లేఖ రాయడాన్ని మానుకోవాలని హితవు కోరారు. జయలలిత చెప్పినట్టుగా ఆడేందుకు నరేంద్ర మోడీ ఏమైనా చంటిపిల్లవాడు కాదనే విషయాన్ని ఆమె గ్రహించాలని కోరారు. అదేసమయంలో తమిళ జాలర్ల అంశంపై జయలలిత రాజకీయం చేయడం మానుకొని, జాలర్ల జీవితాలను బాగు చేసేందుకు కృషి చేయాలని' కోరారు. ఈ పోస్టింగ్ కింద... పైన పేర్కొన్న సమాచారానికి శ్రీలంక రక్షణ శాఖకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం. 
 
దీనిపై జయలలిత మండిపడ్డారు. తక్షణం శ్రీలంకలోని భారత రాయబారిని వెనక్కి పిలవాలని, అలాగే, భారత్‌లోని శ్రీలంక రాయబారిని వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా, ఈ ఫోటోలపై శ్రీలంక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పింది.