ఆజాద్ కోసం ప్రధాని మోడీ కన్నీరు... రాజ్యసభకు నామినేట్ చేస్తామన్న బీజేపీ!
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ఆ పార్టీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లు చెమర్చారు. ఆజాద్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ.. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమన్నారు. పార్లమెంట్‌లో తీవ్రమైన ఉద్వేగానికి గురై కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయారు.
కాగా, గులాం నబీ ఆజాద్ పదవీకాలం ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. దీంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆజాద్‌కు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు.
అనంతరం ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు ఆజాద్ సేవలను కొనియాడారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనదైన మార్కును చూపించారని గుర్తుచేశారు. ఎల్లప్పుడూ ప్రజా సేవకోసమే పరితమించారని ప్రశంసించారు.
ఆ తర్వాత కేంద్ర మంత్రి రామ్‌దాస్ అంథవాలే మాట్లాడుతూ, సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనపై పట్టు కలిగిన ఆజాద్ లాంటి సభ్యులు చట్ట సభల్లో ఉండటం చాలా అవసరమన్నారు. మరో వారంరోజుల్లో ఆయన పదవీ కాలం ముగుస్తోందని, మరోసారి ఆయన పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆజాద్‌ను రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. తాము (ఎన్డీయే) నామినేట్ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి నేతలు సభలో ఉండటం పార్లమెంట్‌కు గర్వకారణమన్నారు.
కాగా, తొలిసారి 1984లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆజాద్ సుమారు 40 ఏళ్లకు పైగా ప్రజాప్రతినిధిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నారు. 2005లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్నికై 2008 వరకు కొనసాగారు. ఆ తర్వాత యూపీయే (2009-2014) ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు.
అయితే 71 ఏళ్ల ఆజాద్‌ను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేయడంపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ నుంచి ఇప్పట్లో ఆయన ఎన్నికైయ్యే అవకాశం కూడా లేదు. దీంతో ఇదే ఆయనకు చివరి అవకాశంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాము నామినేట్ చేస్తామంటూ అథవాలే ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.