శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (11:04 IST)

ఆ ముగ్గురు ప్రొఫెసర్ల వల్లే చనిపోతున్నా : ఐఐటీ-ఎం విద్యార్థిని ఫాతిమా

దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్‌లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. గత యేడాది కాలంలో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, తాజాగా కేరళకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని ముగ్గురు ప్రొఫెసర్ల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీంతో ఈ విద్యార్థిని ఆత్మహత్య కేసు ఐఐటీఎంను ఓ కుదుపుకుదిపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళలోని కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్‌(19) ఐఐటీ మద్రాస్‌లో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమె ఈ నెల 9వ తేదీన తన హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదువు ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుందంటూ మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. 
 
అయితే, ఆమె మొబైల్ ఫోనులో ఉన్న ఓ నోట్ ఈ కేసును మలుపు తిప్పింది. 'నా చావుకు కారణం సుదర్శన్‌ పద్మనాభన్' అనే నోట్‌ కనిపించింది. మరో నోట్‌లో ఆమె.. తన చావుకు పూర్తి కారణం తన ప్రొఫెసర్లయిన హేమచంద్రన్‌ కర్హా‌, మిస్టర్‌ మిలింద్‌ బ్రాహ్మే అని స్పష్టం చేసింది. ఈ నోట్‌ను ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు అందజేశారు. ఈ మేరకు చెన్నై పోలీసు కమిషనర్‌ రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు.
 
ఫాతిమా పేర్కొన్న నోట్‌లో ఉన్న సుదర్శన్ పద్మనాభన్ హ్యూమానిటీస్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్ కాగా, మిలింద్‌ బ్రాహ్మే.. 'ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌' బోధిస్తున్నారు. అలాగే ఐఐటీ మద్రాసుకు సంబంధించి అంబేడ్కర్‌ పెరియార్‌ స్టడీ సర్కిల్‌ అకడమిక్‌ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.