లోక్ సభ ఎన్నికలు 2019, అమెరికాను మించిపోతున్న భారత్... ఏ విషయంలో?
భారతదేశంలో ఎన్నికలు జరిగే సమయంలో డబ్బు ప్రవాహంలా ఉంటుందనే విషయం బహిరంగ సత్యం. అభ్యర్థులు ప్రకటించే ఖర్చులకు చేసే ఖర్చులకు పొంతనే ఉండదు. అయితే ఈ సారి జరగబోయే ఎన్నికల్లో చేయబోయే వ్యయం సరికొత్త ప్రపంచ రికార్డును సాధిస్తుందట. భారతదేశంలో ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు ఆరు వారాల వ్యవధిలో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ జరగనుంది.
ఈసారి జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలు (7 బిలియన్ డాలర్లు) ఖర్చు కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ప్రకటించింది. అయితే ఈ మొత్తం 2014 ఎన్నికల ఖర్చు కంటే 40 శాతం ఎక్కువగా ఉన్నట్లు సిఎమ్ఎస్ పేర్కొన్నది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 6.5 బిలియన్ డాలర్లు ఖర్చు కాగా, భారతదేశంలో 2019 ఎన్నికల ఖర్చు దాని కంటే 50 కోట్ల రూపాయలు ఎక్కువగా ఉండబోతోందని పేర్కొన్నది.
అదేవిధంగా ఇండియాలో 2014 ఎన్నికల్లో సోషల్ మీడియా ఖర్చు రూ. 250 కోట్లుగా ఉండగా ఈ ఎన్నికల్లో దాదాపు 5 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. పార్టీలు పెట్టే ఖర్చులో అత్యధిక భాగం ప్రకటనలు, ప్రయాణ ఖర్చులు, సోషల్ మీడియా ఖర్చులే ఎక్కువగా ఉంటున్నట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వెల్లడించింది.