శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (10:30 IST)

తల్లి మరణంతో కుంగిపోయా.. అందుకే అస్వస్థతకు గురయ్యా..?

తన తల్లి మరణవార్త విని తాను ఎంతగానే కుంగిపోయానని, అందువల్లే జైలులో తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు షీలా బోరా కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియా చెప్పుకొచ్చింది. జైలులో ఉంటున్న ఇంద్రాణి ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనైన విషయం తెల్సిందే. దీనిపై ఆమె వద్ద సీబీఐ ఒక స్టేట్మెంట్‌ను నమోదు చేసింది. 
 
ఈ సందర్భంగా తన తల్లి మరణవార్త తెలుసుకుని తీవ్ర విచారంలో కూరుకుపోయి, దిగ్భ్రాంతికి గురైనట్టు చెప్పారు. ఈ కారణంగానే అపస్మారక స్థితిలోకి వెళ్లానని పోలీసులకు వాంగ్మూలమిచ్చింది. తన అపస్మారక స్థితికి ఎలాంటి మందులు కారణం కాదని, అసలు తాను ఎలాంటి ఔషధాలు తీసుకోలేదని కూడా ఆమె చెప్పినట్టు సమాచారం. 
 
కాగా, కూతురు షీనా బోరా హత్య కేసులో అరెస్టైన ఇంద్రాణి ముంబైలోని బైకుల్లా జైల్లో విచారణ ఖైదీగా ఉంటోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో జైల్లో ఉండగానే ఇంద్రాణి అపస్మారక స్థితిలోకి వెళ్లడం కలకలం రేపింది. అయితే సకాలంలో ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స అనంతరం కోలుకుని నిన్న తిరిగి జైలుకు వచ్చింది. ఇదే ఇంద్రాణి తన కన్నబిడ్డను పాశవికంగా హత్య చేసి కాల్చి చంపింది. కానీ, సొంత తల్లి చనిపోతే మాత్రం కుంగిపోయిందని చెప్పడం గమనార్హం.