మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మే 2024 (20:54 IST)

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేన్సర్???

arvind kejriwal
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాణాంతక కేన్సర్ వ్యాధి సోకిందా? ఔననే సందేహాన్నివ్యక్తం చేస్తున్నారు ఆయన పార్టీ ఆప్‌కు చెందిన సీనియర్ మహిళా నేత, ఢిల్లీ మంత్రి అతిషి. అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గడంతో ఆయనకు కీటోన్ స్థాయులు పెరిగాయని, ఇవి ఆందోళనకు గురిచేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌లో కనిపిస్తున్న లక్షణాలు కిడ్నీ సమస్యలు లేదా కేన్సర్ లక్షణాలను సూచిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందనే ఆరోపణలు రావడంతో ఈడీ, సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం లోక‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువును మరో వారం రోజుల పాటు పొడగించాలని కోరుతూ ఆయన సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో అతిషి.. కేజ్రీవాల్ అకస్మాత్తుగా బరువు తగ్గడమనేది ఆందోళన కలిగించే అంశమన్నారు. కస్టడీ నుంచి బయటకు వచ్చాక వైద్యుల పరిశీలనలో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ తిరిగి బరువు పెరగడం లేదన్నారు. 
 
వైద్య పరీక్షల్లో ఆయన కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని తేలిందన్నారు. అధిక కీటోన్ స్థాయులు ఆకస్మికంగా బరువు తగ్గడమనేది కేన్సర్‌తో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ పెట్ స్కాన్‌తో పాటు ఇతర వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించినట్టు మంత్రి అతిషి తెలిపారు.