శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (22:56 IST)

ఇస్రోను కూడా ప్రైవేటుపరం చేస్తున్నారా? ఛైర్మన్ శివన్ ఏమంటున్నారు?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను కూడా ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రైల్వే శాఖలో ప్రైవేటు రైళ్ళు నడిపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అలాగే, అంతరిక్ష పరిశోధనలు జరిపే ఇస్రోను కూడా ప్రైవేటుపరం చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఇస్రో ఛైర్మన్ కె. శివన్ నాయర్ స్పష్టతనిచ్చారు. 
 
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటుపరం చేయనున్నారంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన గురువారం తోసిపుచ్చారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని, ఇస్రో ప్రైవేటుపరం కాదని గుర్తుచేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణల ప్రకటన ప్రైవేటీకరణకు ఉద్దేశించినది ఎంతమాత్రం కాదని స్పష్టతనిచ్చారు. 
 
'ప్రభుత్వం అంతరిక్ష రంగంలో సంస్కరణలు తెస్తున్నట్టు ప్రకటించగానే కొందరు ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనే అపోహలను తెరపైకి తెచ్చారు. అలాంటిదేమీ లేదు. ఇస్రో ప్రైవేటుపరం కాదని పదేపదే నేను చెబుతూనే ఉన్నాను' అని శివన్ గుర్తుచేశారు.