బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఆర్. సందీప్
Last Modified: బుధవారం, 3 జూన్ 2020 (18:36 IST)

భద్రతా దళాల చేతిలో పుల్వామా దాడి సూత్రధారి హతం

జమ్ము కశ్మీర్‌లో 2019లో 40 మంది సీఆర్‌పిఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడికి పథకం రచించిన ఉగ్రవాది ఫౌజీ భాయ్‌‌ను భారత భద్రతా దళాలు ఎట్టకేలకు తుదిముట్టించాయి. క‌శ్మీర్ ఐజీ విజ‌య్ కుమార్ నేతృత్వంలో సాగిన ఇంటెలిజెన్స్ ఆప‌రేష‌న్ ద్వారా ఇది సాధ్యమైంది. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో కంగన్ గ్రామం వద్ద ఓ ఇంట్లో ఫౌజీ భాయ్‌‌ తలదాచుకుంటున్నాడని సమాచారం తెలియడంతో హతమార్చగలిగారు.
 
కొంత కాలంగా క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న ఉగ్ర దాడుల‌కు, నియంత్రణ రేఖ వెంట జ‌రుగుతున్న అల్లర్లకూ ఇతనే ప్రధాన పాత్రదారుడని అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంట‌ర్‌ కాల్పులలో ఫౌజీ భాయ్‌తో పాటు అనుచరులైన జాహిద్ మ‌న్జూర్ వాణి, మ‌న్జూర్ అహ్మద్ కార్‌లు కూడా మరణించారు. జైష్-ఎ-మహ్మద్ ఉగ్ర సంస్థకు టాప్ క‌మాండ‌ర్‌గా ఫౌజీ భాయ్ వ్యవహరిస్తున్నాడు. జైష్-ఎ మిలిట‌రీ చీఫ్ అబ్దుల్ రౌఫ్ అస్గర్ ఇతడిని సంస్థలో చేర్చుకుని, ఉగ్రవాద కార్యకలాపాల నిమిత్తం 2018లో భారత్‌లోకి పంపినట్లు తెలిసింది.
 
పేర్లు మార్చుకుని భారత్‌లో చలామణీ అవుతూ అనేక ఉగ్రదాడులకు వ్యూహ రచన చేసాడు. అబ్దుల్ రెమ్మాన్‌, ఇద్రిస్, హైద‌ర్, లంబూ అనే పేర్లు ఉపయోగించి సంచరించే వాడు. ఆపరేషన్ కోసం అతను ఎప్పుడూ మొబైల్ ఫోన్ గానీ, ఇతర నెట్‌వర్క్‌లు గానీ ఉపయోగించలేదు. విశ్వసనీయ కొరియర్ సర్వీస్‌ని వాడాడు. ఎన్‌క్రిప్ట్ చేసిన శాటిలైట్ ఫోన్‌సెట్‌తోనే ఫౌజీభాయ్ ఉగ్ర సంస్థ జైష్-ఎ నాయకులను సంప్రదించే వాడని తేలింది.