రెచ్చిపోయిన ఉగ్రమూకలు.. కాశ్మీర్లో టీచర్ మృతి
కాశ్మీర్లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. ఓ హిందూ కుటుంబానికి చెందిన ఉపాధ్యాయురాలిని కాల్చి చంపారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా గోపాలపొర ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
జమ్ము డివిజన్లోని సాంబాకి వలస వచ్చిన ఆమె ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. లోయలో ఇటీవల చెలరేగిపోతున్న ఉగ్రవాదులు ఈ నెల 12న బుద్గాంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి అయిన రాహుల్ భట్‌ను కాల్చి చంపారు.
గత వారం ఓ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్‌ను లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. తాజాగా, ఇప్పుడు ఉపాధ్యాయురాలిని హత్య చేశారు.
ఈ ఘటనపై స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఇది చాలా విచారకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.