శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:35 IST)

'జన్‌ధన్' నగదు ఎప్పుడెవరు తీసుకోవచ్చంటే..?!

ప్రధాన మంత్రి జన్​ధన్​ ఖాతాల్లోని నగదు ఉపసంహరణకు కేంద్రం ఆంక్షలు విధించింది. ఖాతా సంఖ్యల ఆధారంగా తేదీలు కేటాయించింది. ప్రధాన మంత్రి జన్​ధన్‌ ఖాతాల్లో రూ.500 చొప్పున మూడు నెలలపాటు జమ చేయనున్న కేంద్రం.. రేపటి నుంచి నగదు ఉపసంహరించుకోవచ్చని వెల్లడించింది.

కరోనా ప్రభావం కారణంగా ఖాతాదారులు అంతా ఒకేసారి బ్యాంకుల వద్దకు వెళ్లకుండా నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించింది. జన్​ధన్‌ ఖాతాదారులు ఆంధ్రప్రదేశ్‌లో 1,18,55,366 మంది ఉండగా.. తెలంగాణలో 52 లక్షల 23వేల 218 ఖాతాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,70,78,584 జన్​ధన్‌ ఖాతాలున్నాయి.

ఒక్కసారిగా ఖాతాదారులు బ్యాంకు శాఖలకు, ఏటీఎంల వద్దకు నగదు ఉపసంహరణ కోసం గుమిగూడే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు.

ఖాతా సంఖ్య చివరన.. 0 లేక 1 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 3న, 2 లేక 3 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 4న, 4 లేక 5 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 7న, 6 లేక 7 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 8న, 8 లేక 9 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 9న నగదు తీసుకోవచ్చని తెలిపింది.

ఈ నెల 9వ తేదీ లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు తరువాత అయినా తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.