శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (20:20 IST)

సిఆర్‌పిఎఫ్‌కు గుడ్ న్యూస్ ప్రకటించిన కేంద్రం

కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్నతాధికారులకు మాత్రమే ఉన్న విమాన ప్రయాణ సౌకర్యాన్ని కింది స్థాయి ఉద్యోగులకు కూడా కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దీనితో సిఆర్‌పిఎఫ్‌లో కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు సహా 7 లక్షల 80 వేల మంది సిబ్బంది ప్రయోజనం పొందనున్నారు.
 
ఈ నెల 14న పుల్వామాలో జమ్మూ నుండి శ్రీనగర్‌కు దాదాపు 70 వాహనాల్లో 2500 మందికి పైగా సైనిక సిబ్బంది వెళ్తుండగా ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్రం వారి భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల గమ్యానికి త్వరగా చేరుకునే అవకాశం కూడా ఉంటుందని కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
ఇక నుంచి ఢిల్లీ నుండి శ్రీనగర్, అలాగే శ్రీనగర్ నుండి జమ్మూ మార్గాల్లో ప్రయాణించే సిఆర్‌పిఎఫ్ సిబ్బందికి విమానాల్లో వచ్చి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల సైనిక సిబ్బంది సెలవుపై వెళ్లేందుకు, అలాగే తిరిగి విధుల్లో చేరేందుకు కూడా విమాన సౌకర్యాన్ని పొందనున్నారు. అయితే ఈ సౌకర్యాన్ని క్రమంగా మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.