శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

మాజీ ముఖ్యమంత్రి జయలలిత వర్థంతి తేదీపై సరికొత్త వివాదం!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వర్థంతి తేదీపై ఇపుడు సరికొత్త వివాదం నెలకొంది. ఆమె డిసెంబరు 4వ తేదీనే మృతి చెందినట్టు ఆమె మృతిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. దీంతో పలువురు అన్నాడీఎంకే నేతలు డిసెంబరు నాలుగో తేదీనే జయలలిత చిత్ర పటానికి నివాళులు అర్పించారు. 
 
కానీ, గత అన్నాడీఎంకే ప్రభుత్వం జయలలలిత డిసెంబరు 5వ తేదీన చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో జయలలిత మృతి తేదీపై సరికొత్త వివాదం చెలరేగింది. జయ వర్థంతి డిసెంబరు 5 అని ఒకరు, కాదు డిసెంబరు 4నే అని మరో వర్గం నేతలు వాదిస్తున్నరు. 
 
ఈ నేపథ్యంలో జయలలిత మరణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ మాత్రం జయలలిత డిసెంబరు 4వ తేదీన మృతి చెందినట్టు పేర్కొంది. అయితే, పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు దీంతో ఏకీభవించడం లేదు. 
 
జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ పేర్కొన్నదాని ప్రకారం జయలలిత డిసెంబరు 4వ తేదీనే మరణించారు. ప్రభుత్వ ఆదేశంతో మార్పు చేయాలని అన్నాడీఎంకే మాజీ ఎంపీ కేసీ పళనిస్వామి డిమాండ్ చేశారు. అంతేకాకుండా తన వర్గానికి చెందిన 100 మందితో కలిసి ఆదివారమే మెరీనా తీరంలోని జయలలిత సమాధికి నివాళులు కూడా అర్పించారు. 
 
మరోవైపు, అన్నాడీఎంకే నేతలైన మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి, టీటీవీ దినకరన్, శశికళ వర్గాలు మాత్రం జయలలిత వర్థంతి వేడుకలను డిసెంబరు 5వ తేదీన నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం ఆయా వర్గాల నేతలు జయలలిత సమాధికి నివాళులు అర్పించారు.