శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (03:53 IST)

జయలలితకు సీరియస్... 'ఎక్మో' మిషన్‌పై అమ్మ.. సీసీయూలో చికిత్స

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం సీరియస్‌గా ఉంది. ప్రస్తుతం ఎక్మో మిషన్‌ను అమర్చి... ఆమెను కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నిజానికి గత సెప్టెంబరు నెల 22వ తేదీన ఆస్పత్రిలో

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం సీరియస్‌గా ఉంది. ప్రస్తుతం ఎక్మో మిషన్‌ను అమర్చి... ఆమెను కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నిజానికి గత సెప్టెంబరు నెల 22వ తేదీన ఆస్పత్రిలో చేరిన జయలలిత గత 74 రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే, ఆదివారం సాయంత్రం ఆమెకు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో ప్రత్యేక వార్డు నుంచి క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించి చికిత్స చేస్తున్నట్లు అపోలో ఆసుపత్రి ప్రకటించింది. హృద్రోగ, శ్వాసకోశ, క్రిటికల్‌ కేర్‌ నిపుణులు ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. 
 
నిజానికి జయలలితకు అమర్చిన కృత్రిమశ్వాస పరికరాన్ని కూడా తొలగించడంతో త్వరలోనే ఆమె క్షేమంగా ఇంటికి చేరకుంటారని అన్నాడీఎంకే నేతలు భావించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నమే ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సి.పొన్నయన్‌ ఒక ప్రకటన చేశారు. శనివారం రాత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన ఎయిమ్స్‌ వైద్య నిపుణులు ఆమెకు ఇక కృత్రిమశ్వాస అవసరం లేదని, ఆమె మామూలుగానే ఊపిరి పీల్చుకోగలుగుతున్నారని, శ్వాసకోస సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడ్డారని నిర్ధారించారని పొన్నయన్‌ అందులో పేర్కొన్నారు. 
 
కానీ అనూహ్యంగా ఆదివారం సాయంత్రానికి జయ ఆరోగ్య పరిస్థితి విషమించింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో జయకు ‘ఎక్మో’ మిషన్ అమర్చిన వైద్యులు ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే ఎయిమ్స్‌ వైద్యులు లండన్‌ వైద్యుడు బీలేతో ఆమె ఆరోగ్యపరిస్థితిపై సంప్రదింపులు జరుపుతూ వైద్యం అందిస్తున్నారు.