శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 మే 2017 (11:55 IST)

మొన్న జయలలిత కారు డ్రైవర్.. నిన్న రామ్మోహన్ రావు మాజీ డ్రైవర్ హత్య.. రేపు?

వ్యాపం స్కామ్ గుర్తుండే ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న వారందరూ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇదేతరహాలోనే దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌ వాచ్‌మ

వ్యాపం స్కామ్ గుర్తుండే ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న వారందరూ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇదేతరహాలోనే దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌ వాచ్‌మెన్‌ హత్య కేసులోని నిందితులంతా వరుసగా మృతి చెందటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో నిందితుడైన దివంగత ముఖ్యమంత్రి జయలలిత కారు డ్రైవర్‌ కనకరాజ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 
 
మరో నిందితుడు సయాన్‌ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి భార్య వినుప్రియ, కుమార్తె నీతు మృతి చెందారు. వీరిరువురి దేహాలపై కత్తిపోటు గాయాలుండటం కూడా అనుమానం కలిగిస్తోంది. ఇక ఈ హత్య కేసుకు సంబంధించి శనివారం రాత్రి అరెస్టయిన సతీషన్‌, దిబు, సంతోష్‌, ఉదయకుమార్‌ నిందితులేనా అనే అనుమానం కూడా కలుగుతోంది. అలాగే, శనివారం రాత్రి మాజీ సీఎం రామ్మోహన్ రావు మాజీ కారు డ్రైవర్ కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈస్ట్ తాంబరంకు చెందిన ఈయన మోటార్ సైకిల్‌ను టిప్పర్ లారీ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
నిజానికి జయ మృతి చెందిన తర్వాత కొడనాడు ఎస్టేట్‌, బంగళా శశికళ వశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ వేకువజాము గుర్తు తెలియని 11 మంది వ్యక్తులు రెండు కార్లలో ఎస్టేట్‌లో చొరబడి, జయ బంగళా వాచ్‌మెన్‌లు ఓం బహదూర్‌, కృష్ణ బహదూర్‌లపై దాడి జరిపారు. ఈ దాడిలో ఓంబహదూర్‌ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత దుండగులు బంగళాలో చొరబడి కీలకమైన దస్తావేజులు, నగలు, నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని నీలగిరి పోలీసులు విచారణ జరిపారు. 
 
ఎస్టేట్‌ చుట్టూ ఉన్న సీసీటీవీ కెమరాలలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. వాటిలో దోపిడీ దొంగలు ఉపయోగించిన రెండు కార్లు, దోపిడీ దొంగల ముఖాలు నమోదై ఉండటాన్ని గమనించారు. ఆ వీడియో ఆధారాల పరిశీలిస్తున్నప్పుడు దుండగులలో ఒకడి ముఖం జయలలిత మాజీ కారు డ్రైవర్‌ కనకరాజ్‌ను పోలి ఉన్నట్టు కనుగొన్నారు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా కనకరాజ్‌ సేలం సమీపంలోని ఆత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 
 
ఇక కేరళకు చెందిన సయాన్‌ శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రయాణించిన కారులో జయలలితకు చెందిన విలువైన వాచీలు, వస్తువులు లభించటం తీవ్ర సంచలనం కలిగిస్తోంది. కోయంబత్తూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సయాన్‌ వద్ద మేజిస్ట్రేట్‌ సెల్వకుమార్‌ వాంగ్మూలం పొందారు. 
 
కొడనాడు బంగళాలో రూ.200 కోట్ల దాకా నగదు భద్రపరచి ఉంచారని దుండగులు వాటిని దోచుకునేందుకే వెళ్లారని తెలిసింది. ఆ బంగళాలోని జయలలిత గది అద్దాలు పగులగొట్టుకుని దుండగులు ప్రవేశించి విలువైన చేతి గడియారాలు, అలంకరణ వస్తువులు దోచుకున్నారు. ఇక జయలలిత పడకగదిలో ఉన్న నాలుగు సూట్‌ కేసులు తెరచిన స్థితిలో పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. ఆ సూట్‌కేసులలో భద్రపరచిన ఆస్తి పత్రాలు, దస్తావేజులు, నగదు కూడా దోపిడీకి గురై ఉంటాయని అనుమానిస్తున్నారు. మొత్తంమీద కొడనాడు ఎస్టేడ్‌లో దోపిడి జరిగిన తర్వాత వరుస హత్యలు చోటుచేసుకుంటుండటం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి.