శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (19:28 IST)

కమల్ హాసనే మా సీఎం అభ్యర్థి.. ప్రకటించిన శరత్ కుమార్

తమిళనాడులో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మక్కల్ నీధి మయ్యమ్ అధినేత, నటుడు కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో శరత్‌కుమార్‌ పార్టీ ఆలిండియా సముత్వ మక్కల్‌ కట్చీతో కలిసి బరిలోకి దిగనున్నారు.

ఈ మేరకు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టి ఉంటే జత కడుదామనుకున్నారు కమల్. అయితే రజనీ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో కోలీవుడ్‌లోని పలువురు బడా హీరోలతో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు కమల్ హాసన్ వ్యూహరచన చేశారు.
 
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవటంతో తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత, అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ బుధవారం తన పార్టీ ఎన్నికల ఎజెండాను వెల్లడించారు. 
 
మహిళల సంక్షేమానికి తమ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. మహిళల రక్షణ కోసం 181 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే గ్రామీణ బ్యాంక్‌లను మహిళా పథకాల ఆధ్వర్యంలో నిర్వహించేలా కొత్త ప్రతిపాదనలు తీసుకువస్తాని ఎంఎన్‌ఎం పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించింది. అలాగే ఎంఎన్‌ఎంతో కూడిన కూటమి సీఎం అభ్యర్థి కమల్ హాసన్ అని శరత్ కుమార్ ఈ సందర్భంగా ప్రకటించారు. 
 
మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం), అఖిల భారత సమతవ మక్కల్ కచ్చి (ఎఐఎస్ఎంకె), ఇందియ జననాయగ కట్చి (ఐజెకె) ఒక కూటమికి ముద్ర వేశారని, కమల్ హాసన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారని పుదుకోట్టైలో బుధవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఐఐఎస్ఎంకె వ్యవస్థాపకుడు శరత్ కుమార్ తెలిపారు. ఎఐఎస్ఎంకె, ఐజెకె పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. 
 
ఇదే కార్యక్రమంలో ఎఐఎస్ఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ వివేకానందన్ మాట్లాడుతూ, ఎఐఎస్ఎంకె కూటమిలో భాగంగా వేలచ్చేరి నుండి రాధికా శరత్‌కుమార్ పోటీ చేయనున్నారు. ఇక పుదుకొట్టైలో జరిగిన ఈ పార్టీ కార్యక్రమంలో రాధిక శరత్‌కుమార్ మాట్లాడుతూ, ఎఐఎస్ఎం వ్యవస్థాపకుడు శరత్ కుమార్‌కు శత్రువులంటే భయం లేదు. అతను ఆప్యాయతకు మాత్రమే శిరస్సు వంచుతాడని.. అతను ప్రజల అభిమానాన్ని పొందుతాడని నమ్మకం వ్యక్తం చేశారు. తమిళనాడులో ఈ ఎన్నికలు మార్పు తెస్తాయని చెప్పుకొచ్చారు.