వివాదానికి ఆజ్యం పోసిన కంగనా వ్యాఖ్యలు ..(video)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం చివరకు మణికర్ణిక సినీ కార్యాలయం కూల్చివేసేంతవరకు దారితీసింది. అసలు వీరిద్దరి మధ్య వివాదం ఎక్కడ మొదలైందో ఓసారి తెలుసుకుందాం.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశం మేరకు దర్యాప్తు చేస్తోంది. అయితే, ఈ కేసును విచారించిన ముంబై పోలీసులపై నమ్మకం లేదని, ఆ నగరం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లా మారిందంటూ కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే అధికార శివసేన నేతలకు ఎక్కడలేని కోపం తెప్పించింది.
కంగనా వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా మండిపడ్డారు. ముంబైలో భద్రత లేదనుకుంటే తిరిగి రావద్దని, ఆమెను ముంబైలో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. దీంతో కేంద్రం ఆమెకు సీఆర్పీఎఫ్ బలగాలతో 'వై' కేటగిరీ భద్రత కల్పించింది. కేంద్రం నిర్ణయంపై శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మండిపడింది. కేంద్రం చర్య మహారాష్ట్ర పోలీసులను అవమానించినట్టుగా భావించారు.
అదేసమయంలో ఎన్సీపీకి చెందిన రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆమెపై విరుచుకుపడ్డారు. 'బతుకుదెరువుకు ముంబై వచ్చిన అమ్మాయి ఇక్కడి పోలీసులను అవమానించడం విచారకరం. మహారాష్ట్రను అవమానిస్తే ప్రజలు సహించరు' అన్నారు.
కంగనా మాదక ద్రవ్యాలు వాడుతోందని, ఆమెపై దర్యాప్తు జరపాలని శివసేన ఎమ్మెల్యేలు కొందరు డిమాండ్ చేశారు. దీంతో బుధవారం తాను వస్తున్నానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కంగనా ట్విట్టర్‌లో సవాల్ విసిరారు. చెప్పినట్టుగానే కంగనా బుధవారం ముంబై వచ్చారు. అయితే.. ఈలోపే కంగన ఇంట్లోని ఆఫీసు నిర్మాణం అక్రమమంటూ బృహణ్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) కూల్చివేసింది. ఈ కార్పొరేషన్ శివసేన పాలనలోనే ఉంది.
ముంబైలోని ఆమె ఇంటికి అనుబంధంగా ఉన్న ఆఫీసు అక్రమ నిర్మాణమని కార్పొరేషన్ అధికారులు మంగళవారం నోటీసు అంటించారు. ఆమె సమాధానం ఇవ్వకముందే బుధవారం కూల్చివేతకు నోటీసిచ్చారు. వెంటనే జేసీబీలతో అక్కడకు చేరుకుని కూల్చివేయడం మొదలుపెట్టారు. కంగన తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీ హైకోర్టును ఆశ్రయించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు కూల్చివేతపై స్టే విధించింది. ఇంటి యజమాని లేనప్పుడు ఇంటోక్లి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అనంతరం న్యాయవాది విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ అబద్ధమాడుతోందని, కంగన ఇంట్లో నిర్మాణమేదీ జరగకున్నా 'స్టాప్ వర్క్' నోటీసు జారీ చేశారని ఆక్షేపించారు.