1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (15:14 IST)

4 గంటలకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా.. యడ్యూరప్ప

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని యడియూరప్ప సోమవారం ప్రకటించారు. తన ప్రభుత్వ రెండేళ్ల పాలనపై బెంగళూరులో సోమవారం జరిగిన సమావేశంలో యడియూరప్ప మాట్లాడుతూ, తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉండాలని తనను అడిగారని... కానీ, తాను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పానని అన్నారు. ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటూ వచ్చిందన్నారు. తనకు ఎప్పుడూ అగ్ని పరీక్షే ఎదురవుతుంటుందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
 
ఈ రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని... అయినప్పటికీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపానని చెప్పుకొచ్చారు. కర్ణాటక ప్రజలకు తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్‌కు వెళ్లి రాష్ట్ర గవర్నర్‌ గహ్లోట్‌కు తన రాజీనామా పత్రాన్ని యడియూరప్ప అందించనున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన విషయం తెల్సిందే.