బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (09:21 IST)

అరె దోస్త్.. ప్లీజ్ లేవరా.. కంటతడిపెట్టించిన శునకం....

శునకం అంటేనే విశ్వాసానికి మారుపేరు. అవి ఇంటి యజమానికి అంత విశ్వాసంగా ఉంటాయి. ఇంటి యజమానికే కాదు.. ఇంటిల్లిపాదికి ప్రేమను పంచుతుంది. సాటి మనిషుల్లా కాకుండా ఎంతో ప్రేమ, ఆప్యాయతను పంచుతుంది. అయితే, అలాంటి శునకాలకు కూడా తమ జాతిలోనే స్నేహితులు ఉంటారు. వారు తమను వీడి దూరమైనపుడు ఆ శునకం పడే బాధ వర్ణనాతీతం. తాజాగా ఓ తనతో ఉండే ఓ శునకం రోడ్డు ప్రమాదంలో చనిపోగా, దాన్ని బతికించుకునేందుకు ఆ కుక్కపడే పాట్లు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించాయి. 
 
సాధారణంగా, ఈ కాలంలో రోడ్డుపై ఏదేని చిన్నపాటి సంఘటన జరిగినా.. దారినపోయోవాళ్లు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తుంటారు. చివరకు సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకపోగా, వీడియోలకే పరిమితమవుతుంటారు. కానీ, తమ జాతిలో అలాంటి అలవాటు లేదని నిరూపించిందో శునకం. 
 
కర్నాటక రాష్ట్రంలోని దొడ్డబళ్ళాపురం రామనగర శివారులో అర్చకరహళ్లి వద్ద రహదారిపై అపరిచిత వాహనం ఢీకొని ఒక కుక్క మృతి చెందింది. కుక్క కళేబరం ముందు మరో కుక్క చాలాసేపు రోదిస్తూ మృతి చెందిన కుక్కను లేపడానికి శతవిధాలా ప్రయత్నించింది. దరిదాపులకు ఎవ్వరినీ రానివ్వలేదు. ఈ దృశ్యాలు స్థానికులకు కన్నీళ్లు తెప్పించాయి.