ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జూన్ 2023 (11:50 IST)

చట్ట దుర్వినియోగం అంటే ఇదే.. పెళ్లిన మూడో రోజే వేధింపులంటూ భార్య ఫిర్యాదు

court
వివాహమైన మూడో రోజు నుంచే తనను భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఓ వధువు ఫిర్యాదు చేసిన కేసులో కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. చట్ట దుర్వినియోగం అంటే ఇంతకుమించిన మంచి ఉదాహరణ మరొకటి ఉండబోదంటూ వ్యాఖ్యానించింది. వివాహమైన మూడో రోజే ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య.. భర్త, అతని కుటుంబసభ్యులపై పెట్టిన వేధింపుల కేసుపై స్టే విధిస్తూ కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 
 
బెంగళూరులో ఓ బైక్ షోరూంలో పనిచేసే ఆ ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకొని ఈ ఏడాది జనవరి 27న గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆమె అంతకుముందు మరో వ్యక్తితో ప్రేమాయణం నడిపిందని, వాట్సప్ అతనితో సంప్రదింపులు కొనసాగిస్తోందని భర్తకు తెలియడంతో పెళ్లైన రెండో రోజే ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో వివాహాన్ని తెగదెంపులు చేసుకుంటానని బెదిరించి, జనవరి 29నే భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి వధువు ఓ మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించింది. 
 
మార్చి 2వ తేదీన భర్త, అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి రోజు ఏమి జరిగిందో కూడా తనకు తెలియదని, అప్పుడు మత్తుగా ఉందని, రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకం చేసినట్టు కూడా గుర్తులేదని ఫిర్యాదులో వివరించింది. అటువంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగినందున మొదటి రాత్రి తమ మధ్య జరిగిన చర్యను అత్యాచారంగా పరిగణించాలని పేర్కొంది. 
 
పెళ్లికి ముందు తాను మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న విషయం తెలుసుకొని భర్త, అతని కుటుంబసభ్యులు తనను చిత్రహింసలు పెట్టారని ఆరోపించింది. ఈ ఫిర్యాదును భర్త, అతని కుటుంబసభ్యులు హైకోర్టులో సవాల్ చేశారు. వారి వాదనలు విన్న ధర్మాసనం 'చట్టం దుర్వినియోగానికి ఇంతకంటే ఉత్తమ ఉదాహరణ మరొకటి ఉండబోదు' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు పరిష్కారమయ్యే వరకు పిటిషనర్లపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చింది.