గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2022 (16:45 IST)

సాయిబాబా పాదాల వద్ద గుండెపోటుతో భక్తుడి మృతి... ఎక్కడ?

deadbody
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ పట్టణంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూనే ఓ భక్తుడు దైవం చెంతకు చేరుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, రాజేశ్ మేహానీ అనే భక్తుడు స్థానిక సాయిబాబా ఆలయంలో పూజలో పాల్గొన్న అనంతరం బాబా విగ్రహం పాదాల వద్ద కూర్చొని దైవాన్ని ప్రార్థిస్తూనే ప్రాణాలు విడిచాడు. 
 
బాబా పాదాల వద్ద తలవాల్చి కూర్చొన్న రాజేశ్.. ఎంత సేపటికి పైకి లేవకపోవడంతో తోటి భక్తులు పూజారికి సమాచారం అందించారు. ఆయన వచ్చి రాజేశ్‌ను కదపగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించగా, రాజేశ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆలయ ప్రార్థన సమయంలోనే రాజేశ్‌కు నిశ్శబ్ద గుండెపోటు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
స్థానికంగా మెడికల్ షాపును నడుపుతున్న రాజేశ్.. ప్రతి గురువారం స్థానికంగా ఉండే సాయిబాబా గుడికి క్రమం తప్పకుండా వచ్చి తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయన మృతి చెందారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇపుడు సోషల్ మీడియాలో వైరలైంది.