1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (08:21 IST)

కేరళలో మరో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం... వ్యక్తిని నేలకేసి కొట్టి తలపై కూర్చొన్న పోలీస్

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పట్ల అమెరికా పోలీసులు ప్రవర్తించిన తీరును యావత్ ప్రపంచం ఖండించింది. అలాంటి ఘటనే ఇపుడు కేరళ రాష్ట్రంలో జరిగింది. మంత్రి రాజీనామా చేయాలంటూ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తను ఓ పోలీస్ అధికారి.. పట్టుకుని నేలకేసి కొట్టి.. అతడి తలపై కూర్చొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చర్య పట్ల కేరళ పోలీసుల తీరును నెటజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో మంత్రి జలీల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దీంతో ఆయన రాజీనామా చేయాలంటూ కేరళ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. 
 
అదేసమయంలో మంత్రి జలీల్ కాన్వాయ్ వస్తుండడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆంటోనీ అనే కార్యకర్త కిందపడిపోయాడు. 
 
అప్పటికే అతడి వద్దకు చేరుకున్న పోలీసు అధికారి ఆంటోనీని నేలకేసి గట్టిగా అదిమిపట్టి మంత్రి కాన్వాయ్ వెళ్లిపోయే వరకు ఆయనపై కూర్చున్నారు. దీనిని గమనించిన సహచరులు అక్కడికి చేరుకుని అతనిని రక్షించారు.
 
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ కాంగ్రెస్ నేత వీటీ బలరామ్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 
 
ఆంటోనీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమెరికాలో పోలీసుల దౌర్జన్యం కారణంగా మరణించిన జార్జ్ ఫ్లాయిడ్‌ను తలపిస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళలో మరో జార్జ్ ఫ్లాయిడ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.