పంది జ్వరం పోయింది.. ఇపుడు కోతి జ్వరం వచ్చింది.... దీని లక్షణాలేంటి?
నిన్నామొన్నటివరకు పంది జ్వరం (స్వైన్ ప్లూ)తో వణికిపోయారు. ఇపుడు కోతి జ్వరం ప్రతి ఒక్కరినీ గుబులు రేపుతోంది. ముఖ్యంగా, కర్ణాటక రాష్ట్ర వాసులు ఈ జ్వరం పేరు వింటేనే వణికిపోతున్నారు. దీని అసలు పేరు క్యాసనూరు ఫారెస్ట్ డిసీజ్. ఉత్తర కన్నడ జిల్లాలో ఏకంగా వంది మందికి పైగా ప్రజలు ఈ జ్వరంతో బాదఫడుతున్నారు. ముఖ్యంగా, అరలగోడ పంచాయితీ ప్రాంతంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. దీంతో అక్కడి వారంతా భయాందోళనకు గురవుతున్నారు.
ఇటీవలే యానా అటవీప్రాంతంలో ట్రెక్కింగ్ చేసిన ఓ ప్రెంచ్ మహిళా పర్యాటకురాలు జ్వరం బారినపడ్డారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి బాగా విస్తృతమైంది. ఫలితంగా అటవీ ప్రాంతానికి, కోతులకు దూరంగా ఉండాలని అధికారులు అక్కడక్కడా హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ రకం జ్వరం ఒక రకమైన పేనుతో వ్యాపిస్తుందని గుర్తించారు. అదేసయమంలో కర్ణాటకలోని అటవీ ప్రాంత పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈ తరహా జ్వరం తొలిసారి 1957లో శివమొగ్గ జిల్లాలోని క్యాసనూరు గ్రామంలో ఈ వ్యాధిని గుర్తించారు. దీంతో క్యాసనూరు ఫారెస్ట్ డిసీజ్‌గా గుర్తించారు.
తీవ్ర జ్వరం, తలనొప్పి, తలతిరుగుడు, వాంతులు, వణుకు గందరగోళం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. వ్యాధి ముదిరితే ముక్కు, గొంతు, చిగుర్ల నుంచి రక్తం కారుతుంది. కేవలం లక్షణాలను బట్టి మాత్రమే చికిత్స అందిస్తారు. పేను, కోతులు, అడవి ఎలుకలు, గబ్బిలాలు, ఉడుత జాతులు ఈ వ్యాపింపజేస్తాయి. రెండు జిల్లాల్లో 120 కోతులు మరణించాయి. వాటిలో 36 కోతుల్లో వ్యాధి క్రిములు కనిపించాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ కోతులు మరణించడంతో వాటి రక్తనమూనాలను పుణే ఇన్‌స్టిట్యూట్ ఆప్ వైరాలజీకి పరీక్షల నిమిత్తం పంపించారు.