ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (10:57 IST)

కేసు సాగదీస్తే న్యాయవాదులకే లాభం : చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

dychandrachud
కేసును సాగదీయడం వల్ల న్యాయవాదులకే లాభిస్తుందని ఓ దంపతులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. వైవాహిక బంధంలో వివాదాల వ్యవహారంలో సుదీర్ఘ న్యాయపోరాటం వల్ల న్యాయవాదులకే ప్రయోజనం కలుగుతుందని, కాబట్టి దంపతులు అవసరమైతే పరస్పర సమ్మతితో విడాకులకు అంగీకరించాలని ఆయన ఓ జంటకు సూచించారు.
 
తమ భార్యాభర్తల కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని ఓ కేసులో మహిళ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా మహిళ ఏం చేస్తుందో సీజేఐ చంద్రచూడ్ అడిగి తెలుసుకున్నారు. తాను ఎంటెక్ పూర్తి చేశానని, అమెరికా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందినట్లు కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం తాను ఉద్యోగం ఏమీ చేయడం లేదని కూడా వెల్లడించింది.
 
మీరు మంచి విద్యావంతులు, కాబట్టి మొదట ఉద్యోగం సంపాదించుకోవాలని సూచించారు. అదేసమయంలో ఈ కేసులో మీరు పదేళ్లైనా న్యాయ పోరాటం చేయగలరేమో కానీ అలా చేయడం వల్ల న్యాయవాదులకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందన్నారు. కాబట్టి పరస్పర సమ్మతితో విడాకులు తీసుకోవడానికి ఎందుకు అంగీకరించకూడదు? అందుకు మీరు సిద్ధపడితే మాత్రం కేసును క్లోజ్ చేస్తామన్నారు.