సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 మే 2021 (10:06 IST)

మహారాష్ట్రలో మే నెలాఖరు వరకు లాక్డౌన్!

దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రం మహారాష్ట్ర. ఈ వైరస్ దెబ్బకు మహారాష్ట్ర అతలాకుతలమైంది. దీంతో లాక్డౌన్ విధించక తప్పలేదు. ప్ర‌స్తుతం మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను మ‌రోమారు పెంచ‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. 
 
బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వశాఖతో పాటు ఇత‌ర‌ మంత్రులు లాక్డౌన్‌ను మరో 15 రోజులు అంటే మే 31 పొడిగించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. 
 
ఈ సమావేశం తర్వాత ఆరోగ్యశాఖ‌ మంత్రి రాజేష్ తోపే మాట్లాడుతూ రాష్ట్రంలోని విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను చూసిన తర్వాత మ‌రో 15 రోజులపాటు లాక్డౌన్ పెంచాల‌నే ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని, అయితే దీనిపై ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తుది నిర్ణ‌యం తీసుకుంటార‌న్నారు. 
 
కాగా మ‌హారాష్ట్ర‌లోని 12 జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు, లాక్‌డౌన్ ఎత్తివేస్తే మ‌రోమారు క‌రోనా కేసులు పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని అధికారులు అంటున్నారు. 
 
మరోవైపు, మే 20వ తేదీ తర్వాత మహారాష్ట్రకు 1.5 కోట్ల డోసుల కొవిడ్ -19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను అందజేస్తామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠ్రాక్రేకు హామీ ఇచ్చినట్లు రాజేష్ తోపే వెల్లడించారు. 
 
కొవిడ్ నిర్వహణపై జరిగిన మహారాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి రాజేష్ తోపే మీడియాతో మాట్లాడారు. కొవిడ్ టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తాత్కాలికంగా 18-44 ఏళ్ల వారికి వేయడం లేదని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి టీకాలను 45 ఏళ్ల వయసు పైబడిన వారికి మళ్లించామన్నారు. 
 
కేబినెట్ సమావేశంలో లాక్ డౌన్ ను మరో 15రోజుల పాటు పొడిగించాలని మంత్రులు, ఆరోగ్యశాఖ ప్రతిపాదించాయని, దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి రాజేష్ చెప్పారు. కేంద్రప్రభుత్వం నిబంధనలను సడలించాలని మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ కోరారు. కేంద్రం నిబంధనలు సడలిస్తే వచ్చే 3, 4 నెలల్లోగా ప్రజలకు టీకాలు వేయగలుగుతామని మంత్రి అస్లాం చెప్పారు.